CP Radhakrishnan | భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి.. కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 17 మంది ఎంపీలు గైర్హాజరవగా.. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారని రాజ్యసభ సెక్రటరీ తెలిపారు. ఎన్నికల్లో 767 మంది సభ్యులు ఓటు వేశారని.. 752 చెల్లుబాటు అయ్యాయని ఆయన తెలిపారు. విజయానికి 377 ఓట్లు అవసరమని వివరించారు.
సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడు తిరుప్పూర్‌లో సీకే పొన్నుసామి, కే జానకి దంపతులకు జన్మించారు. తూత్తుకుడిలోని వీఓ చిదంబరం కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ అందుకున్నారు. 1974లో ఆయన జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీకి ఎన్నికయ్యారు. 1980లో బీజేపీలో చేరారు. అటల్ బిహారీ వాజ్‌పేయికి సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన తమిళనాడు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన జూలై 31, 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. అంతకుముందు ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా సేవలందించారు.
తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆయన ఆర్ఎస్ఎస్లో పని చేశారు. బీజేపీ నుంచి 1998 లో కోయంబత్తూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ గెలుపొందారు. ఆయన తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా . 2004 సార్వత్రిక ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కే సుబ్బరాయన్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇటీవల జగ్దీప్ ధన్ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించింది.