తిరువనంతపురం : కేరళలో సీపీఎం యువజన నేత దారుణానికి పాల్పడ్డాడు. ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను ఉరితీసి హత్య చేసిన కేసులో సీపీఎం యువనేతను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 30న బాలిక ఇంటిలోని గదిలో వేలాడుతూ విగతజీవిగా పడిఉండటం కనిపించింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బాలికకు స్వీట్లు పంచుతాననే ఆశచూపి నిందితుడు మూడేండ్లుగా అరాచకానికి పాల్పడుతున్నాడు.
జూన్ 30న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఆపై బాధితురాలు స్రృహ కోల్పోవడంతో మరణించిందని భయపడుతూ రూమ్లో ఆమెను ఊపిరాడకుండా చేసి వేలాడదీసి హత్య చేశాడు. బాలిక పోస్ట్మార్టం నివేదికలోనూ ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడైంది. విచారణలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.