న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపుతున్నది. దీంతో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏండ్లు నిండి, సెకండ్ డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసుకు అర్హులని శుక్రవారం తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బూస్టర్ డోసు టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దీంతో కరోనా టీకా బూస్టర్ డోసు కావాలనుకునేవారు డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. బూస్టర్ డోసుకు సంబంధించి కొవిన్‌లో రిజిస్ట్రేషన్ కోసం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అయితే బూస్టర్ డోసు ధర ఎంత అన్నది స్పష్టం చేయలేదు.
కాగా, కోవిషీల్డ్ టీకాను తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బూస్టర్ డోస్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కీలక సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. బూస్టర్ డోసుగా కోవిషీల్డ్‌కు అనుమతి లభించిందన్నారు. బూస్టర్ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు. అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్ డోసు కోవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు, హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ బూస్టర్ డోసు కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందనున్నట్లు తెలుస్తున్నది. అయితే కొవాగ్జిన్ బూస్టర్ డోసు ధర రూ.900తోపాటు పన్నులు అదనంగా ఉండనున్నాయి.