Covid in Delhi | ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో తిరిగి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు వారాలుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కొవిడ్-19 కేసుల వ్యాప్తి 500 శాతం పెరిగిందని లోకల్ సర్కిల్ అధ్యయనంలో తేలింది. తమ కుటుంబ సభ్యుల్లో గానీ, సన్నిహితుల్లో గానీ ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలిందని 19 శాతం ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంత వాసులు అంటున్నారు.
ఇటీవలి కాలంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడానికి లోకల్ సర్కిల్ ఓ అధ్యయనం నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 11,743 మంది ప్రజలను ప్రశ్నించింది. తమలో ఏ ఒక్కరికి కరోనా రాలేదని 70 శాతం మంది చెబితే, 11 శాతం మంది తమ సన్నిహితుల్లో ఒకరిద్దరు మహమ్మారి బారిన పడ్డారని చెప్పారు.
8 శాతం మంది తమ వారిలో ముగ్గురి నుంచి ఐదుగురికి కరోనా సోకిందని తెలిపారు. 11 శాతం మంది మాత్రం చెప్పలేం అని జవాబిచ్చారు. ఈ నెల 2న లోకల్ సర్కిల్ ఈ సర్వే జరిపింది. కేవలం 3 శాతం మంది మాత్రమే తమ సన్నిహితుల్లో ఒకరు మాత్రమే కొవిడ్ భారీన పడ్డారని చెప్పినట్లు లోకల్ సర్కిల్ తెలిపింది.
ఢిల్లీలో ప్రస్తుతం కొవిడ్-19 రోజురోజుకు వ్యాపిస్తున్నది. శనివారం 461 కేసులు నమోదైతే, శుక్రవారం 300 పై చిలుకు కేసులు బయట పడ్డాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 5.33 శాతానికి పెరిగింది. రెండు వారాలుగా కరోనా వ్యాపిస్తున్నట్లు నిర్దారణ కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. దీంతో మరోమారు కరోనా నిబంధనలను, మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఢిల్లీ సర్కార్ సమాయాత్తమవుతున్నది.