న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. రెండేళ్లు గడిచినా మహమ్మారికి అంతమెప్పుడో నిపుణులే చెప్పలేని పరిస్థితి. గతవారం పది రోజులుగా దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 3న వరకు రోజుకు 3వేలకుపైగా కొత్త కేసులు నమోదైతే.. 11వ తేదీ నాటికి 8వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 8వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 45వేలకు చేరువయ్యాయి. వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే, దేశంలో వేసవి సెలవుల కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలు సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా పేర్కొంటున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం చాలా వరకు కేసుల పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, ఈ ఇది కాస్త ఊరట కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రత్యేక నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చాలా వేగంగా దిగజారుతోంది. మే 17 నుంచి ముంబైలో రోజువారీ కేసుల్లో దాదాపు వెయ్యిశాతం పెరుగుదల నమోదైంది. 17న ఆ రాష్ట్రంలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 11 నాటికి 1745కు చేరాయి. పశ్చిమ బెంగాల్లోనూ 30శాతం రోజువారీ కేసులు పెరిగాయి.
భారత్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4, బీఏ.5 కేసులు నమోదవుతున్నాయి. గత పది రోజుల్లో పలువురు ఈ వేరియంట్ల బారినపడ్డారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అధిక ఇన్ఫెక్టివిటీ రేటు కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ సబ్ వేరియంట్లను గుర్తించారు. ఈ రెండింటిని నిపుణులు ర్యాపిడ్ స్ప్రెడర్లుగా వర్ణించారు. భారత్కు ముందు దక్షిణాఫ్రికాతో పాటు యూరోపియన్ యూనియన్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీటి కారణంగా చాలా దేశాల్లో కేసులు భారీగా పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మారియా వాన్కెర్ఖోవ్ బీఏ.4, బీఏ5 సబ్ వేరియంట్లు కొన్ని ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో ఇన్ఫెక్టివిటీ రేటును గణనీయంగా పెంచుతాయని పేర్కొన్నారు. టీకాలతో లభించే రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని వేరియంట్లు తప్పించుకుంటాయని పేర్కొన్నారు.
శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఈ వేరియంట్లు అధిగమిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం వైరస్ నుంచి ముప్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ల నేపథ్యంలో బూస్టర్ డోస్ ఎంత మేరకు ప్రభావం ఉంటుందనే విషయంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నా తీవ్రమైన ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.