బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రెండు రోజుల్లో కరోనా కేసులు డబుల్ అవుతున్నాయి. ఒక్క రోజులోనే 68 శాతం మేర కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,449 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన 5,031 కేసుల కంటే ఇది 68 శాతం ఎక్కువ. శుక్రవారం బెంగళూరులోనే అత్యధికంగా 6,812 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో యాక్టిక్ కేసుల సంఖ్య 30,113కు చేరింది. రోజువారీ పాజిటివ్ రేటు 4.15 శాతంగా ఉన్నది.
కాగా, కర్ణాటకలో కరోనా కేసులు రెండు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి. సోమవారం రెండు వేలకు పైగా ఉన్న కరోనా కేసులు బుధవారానికి 4,246కు చేరాయి. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 8,449కి పెరిగింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,31,052కు చేరింది. గత 24 గంటల్లో 505 మంది రోగులు కోలుకోగా, నలుగురు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 38,362కు పెరిగింది.
మరోవైపు కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. గురువారం ఏకంగా 107 కొత్త వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 333కు చేరింది. దేశ వ్యాప్తంగా పోల్చితే ఒమిక్రాన్ కేసులపరంగా మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత కర్ణాటక మూడో స్థానంలో ఉన్నది.