సింగపూర్, మే 22: సింగపూర్‌లో కొవిడ్-19 వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఒక్క వారం రోజుల్లోనే దాదాపు నాలుగు వేలకు పైగా కేసులు పెరుగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మే 10 నుండి 16 వరకు సింగపూర్‌లో సుమారు 12,700 కొవిడ్-19 కేసులు నమోదైనట్లు గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు వారంలో ఈ సంఖ్య 8 వేలుగా ఉంది. ఇదే సమయంలో సగటు రోజువారీ దవాఖానల్లో చేరే వారి సంఖ్య వారం క్రితం 56 నుండి 73కి పెరిగింది. అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) కేసులు రోజుకు సగటున ఒకటిగా నమోదైనట్లు సంక్రమిక వ్యాధుల ఏజెన్సీ(సీడీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. కేసుల పెరుగుదలను ప్రభుత్వ అత్యవసర దవాఖానలు నిర్వహించగలవని ఏజెన్సీ తెలిపింది.
జనాభాలో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరగవచ్చని సీడీఏ పేర్కొంది. జేఎన్.1 స్ట్రెయిన్ నుండి ఉద్భవించిన ఎన్బీ.1.8.1 రకం సింగపూర్‌లో ప్రధానమైన కొవిడ్-19 వేరియంట్‌గా కొనసాగుతున్నది. స్థానికంగా సీక్వెన్స్ చేసిన కేసుల్లో సగానికి పైగా ఈ వేరియంట్‌వే ఉన్నాయి. కరోనా టీకాలు ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ నుండి రక్షణను అందిస్తూనే ఉన్నాయని ఏజెన్సీ పేర్కొంది. ఇతర శ్వాసకోశ వ్యాధులతోపాటు ఈ వైరస్ కూడా స్థానికంగా వ్యాపిస్తున్నందున ఇన్ఫెక్షన్ల పెరుగుదలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఏజెన్సీ తెలిపింది. అయితే మునుపటి స్ట్రెయిన్లతో పోలిస్తే స్థానికంగా వ్యాపిస్తున్న వేరియంట్లు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయని లేదా మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తాయని చెప్పడానికి ప్రస్తుతం ఎటువంటి సూచన లేదని ఏజెన్సీ స్పష్టం చేసింది.