న్యూఢిల్లీ: దేశంలో 2021 జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ అప్పటి నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతూనే ఉన్నది. నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దేశమంతటా వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతున్నది. దాంతో ఇవాళ ఉదయం ఏడు గంటల వరకు దేశంలో మొత్తం 160.43 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు 24 గంటల వ్యవధిలోనే 70 లక్షలకుపైగా టీకాలు వేశారు.
గడిచిన 24 గంటల్లో 70,49,779 మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దాంతో ఇప్పటివరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 160,43,70,484కు చేరింది. మొత్తం 1,72,80,628 సెషన్ల ద్వారా వ్యాక్సినేషన్ ఈ మైలురాయిని చేరుకున్నదని ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 68,61,926 ప్రికాషనరీ లేదా బూస్టర్ డోసులు పంపిణీ అయినట్లు వెల్లడించింది.
ఇక 15-18 ఏండ్ల వయసు వారికి ఇచ్చే టీకాలు కూడా 3,96,06,464కు చేరినట్లు కేంద్ర వైద్యారోగ్య శాక తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. ముందుగా హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60 ఏండ్లు దాటిన వృద్ధులకు టీకాలు వేశారు. గత మార్చి 1వ తేదీ నుంచి 45 ఏండ్లు దాటి కోమార్బిడిటీస్ ఉన్నవారికి టీకాలు ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా 45 ఏండ్లు దాటిన అందరికీ టీకాలు మొదలుపెట్టారు.
మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల మధ్య వయసు కలిగిన టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. త్వరలో 12-14 ఏండ్ల మధ్య వయసు వారికి కూడా టీకా ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తున్నది.