జమ్ము: జమ్ము కశ్మీర్‌లోని త్రికూట పర్వతాలపై ఉన్న శ్రీ మాత వైష్ణో దేవి గుడికి సుమారు రూ.550 కోట్ల విలువైన నకిలీ వెండి కానుకలు అందాయన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ విచారణ అధికారిని జమ్ము కోర్టు ఒకటి సోమవారం ఆదేశించింది. అడ్వొకేట్ దీపక్ శర్మ పిటిషన్‌పై స్పందిస్తూ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. నకిలీ కానుకల విషయమై తాను ఈ సంవత్సరం మే 9న క్రైమ్ ఐజీపీకి, ఎస్ఎస్పీకి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కోరానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. కీలక సాక్ష్యాధారాల పరిరక్షణకు తీసుకొన్న చర్యల గురించి పోలీసులు స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొనలేదని వాదించారు.
రూ.550 కోట్ల విలువైన 20 టన్నుల వెండి కానుకలను ఆలయ బోర్డ్ పరీక్షించడం, కరిగించడం, ప్రాసెస్ చేయడం కోసం పంపగా కేవలం 5-6 శాతం పదార్థం మాత్రమే అసలైన వెండిగా తేలింది. ఈ నేపథ్యంలోవ్యాపారులు భక్తులకు నకిలీ, కల్తీ వెండి వస్తువులను అమ్మారా లేదా వాటిని స్వీకరించాక అసలైన వెండి కానుకలను మార్చివేశారా, వాటి నాణ్యతను తగ్గించారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరపాలని ఫిర్యాదిదారు కోరారు.