లక్నో: భార్యాభర్తలు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్ ద్వారా వృద్ధులను యువకులుగా మారుస్తామని నమ్మించారు. సుమారు రూ.35 కోట్ల మేర పలువురిని మోసగించారు. (Couple’s Age Reversal Scam) ఒక వృద్ధురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మీ దూబే కలిసి కాన్పూర్లో రివైవల్ వరల్డ్ పేరుతో ఒక థెరపీ సెంటర్ను ప్రారంభించారు. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన టైమ్ మెషిన్ ద్వారా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల వ్యక్తిగా మారుస్తామని నమ్మించారు. కలుషిత గాలి వల్ల వేగంగా వయసు పెరుగుతుందని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలల వ్యవధిలో వృద్ధుల వయస్సును వెనక్కి మళ్లించి యువతగా పునరుద్ధరిస్తామని వినియోగదారులకు హామీ ఇచ్చారు.
కాగా, అద్దె ఇంట్లో నివసిస్తున్న ఈ జంట పలువురు వృద్ధులను మోసగించారు. 10 సెషన్లకు రూ. 6,000, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ.90,000 అంటూ పలు ప్యాకేజీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రూ.10.75 లక్షల మేర తనను మోసగించారని వృద్ధురాలైన రేణు సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ భార్యాభర్తలు వందలాది మందిని సుమారు రూ. 35 కోట్లు మేర మోసం చేశారని ఆమె ఆరోపించింది.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వయస్సును వెనక్కి మళ్లిస్తామంటూ పలువురు వృద్ధులను కోట్లలో మోసగించిన ఈ జంట విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.