జైపూర్: ఇద్దరు పిల్లల తల్లైన మహిళ భర్త నుంచి విడిపోయింది. ఒక వ్యక్తితో కలిసి నివసిస్తున్నది. ఆ మహిళకు కుటుంబ నియంత్రణ సర్జరీ జరుగడంతో ఆ వ్యక్తితో పిల్లల్ని కనలేకపోయింది. దీంతో వారిద్దరూ కలిసి రైల్వే స్టేషన్ నుంచి ఒక బాలుడ్ని కిడ్నాప్ చేశారు. (Couple Kidnaps Child) దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల జీవిక ఇద్దరు పిల్లల తల్లి. అయితే భర్త, పిల్లలను ఆమె విడిచిపెట్టింది. కూలీ పనులు చేసుకునే 28 ఏళ్ల సుందర్ కశ్యప్‌తో కలిసి జీవిస్తున్నది.
కాగా, జీవిక, సుందర్ కలిసి పిల్లలను కనాలనుకున్నారు. అయితే జీవికకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరుగడంతో ఆమె గర్భం దాల్చలేకపోయింది. మందులు వాడినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని కిడ్నాప్ చేసి పెంచుకోవాలని వారిద్దరూ భావించారు. దీని కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు మార్చి 14న సాయంత్రం వేళ జీవిక, సుందర్ కలిసి జైపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ముగ్గురు పిల్లలతో కలసి బీహార్‌లోని సివాన్‌కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో వేచి ఉన్న ప్రియాంకను వారు గమనించారు. ఆమె నాలుగేళ్ల కుమారుడు శివమ్‌కు బిస్కెట్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. అదును చూసి ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. ఒక జంక్షన్ వద్ద ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే బస్సు ఎక్కారు.
కాగా, శివమ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాత్రంతా అతడి కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. జీవిక, సుందర్ కలిసి ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారి కదలికలను ట్రేస్ చేశారు.
మరోవైపు రాజస్థాన్ దౌసా జిల్లాలోని మహువాలో ఆ జంట ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. వారి ఇంటికి చేరుతున్నారు. కిడ్నాప్ చేసిన బాలుడ్ని స్వాధీనం చేసుకున్నారు. శివమ్‌ను అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. జీవిక, సుందర్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, ఆ జంట కిడ్నాప్ చేసిన రెండు రోజుల్లోనే ఆ బాలుడికి ఆశిష్ అని పేరు పెట్టారని పోలీస్ అధికారి తెలిపారు. తనను అమ్మ అని పిలువాలని జీవిక అతడ్ని బలవంతం చేసినట్లు తెలిసిందని చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ జంట రైల్వే స్టేషన్ నుంచి బాలుడ్ని కిడ్నాప్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Jaipur रेलवे स्टेशन से मासूम को अगवा करने का मामला, GRP जयपुर पुलिस को मिली प्रकरण में बड़ी सफलता@jaipur_police @PantVinay #LatestNews #RajasthanNews #RajasthanWithZee pic.twitter.com/F0UhzaQhsk
— ZEE Rajasthan (@zeerajasthan_) March 17, 2025