న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఈ సారి బీజేపీదే విజయం అంటున్నాయి.. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఆప్ మరోసారి విపక్షాలను చీపురుతో జాడిస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు (Delhi Elections) ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు ఫలితాలపై ఒక స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద పారా మిలిటరీ బలగాలు సహా 10 వేలమంది పోలీసులను మోహరించింది.
ఢిల్లీ అసెంబ్లీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలకంటే 1.56 శాతం ఎక్కువ. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీచేశారు. కాగా, ఢిల్లీలో 2013 నుంచి అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ వరుసగా నాలుగోసారీ తన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నది. ఇక 27 ఏండ్లుగా అధికారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి అధికారపార్టీకి గట్టిపోటీనిచ్చింది.
కాగా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే అనుకూలంగా తీర్పునివ్వగా, ఆ అంచనాలను తారుమారుచేసి ఆప్ గెలుస్తుందా అని దేశవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీచేసిన ప్రతిసారీ ఎగ్జిపోల్స్ ఆ పార్టీకి వ్యతిరేకంగానే వచ్చాయి. 2013లో బీజేపీకి 35 సీట్లు, కేజ్రీవాస్ పార్టీకి 17 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటిని తారుమారు చేస్తూ ఆప్ 28 చోట్ల గెలుపొందింది. ఇక బీజేపీ 32, కాంగ్రెస్ 8 చొప్పున సీట్లు సాధించాయి.
రెండేండ్లకే 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 35-53 సీట్లు, బీజేపీకి 25 సీట్లు వస్తాయనిని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఆప్ ఏకంగా 67 స్థానాలతో క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. ఇక 2020లో ఆప్ మెజార్టీ తగ్గుతుందని, 54 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి. దానికి భిన్నంగా 62 సీట్లు సాధించింది. ఇక ఈసారి ఆప్ అధికారం కోల్పోతుందని, బీజేపీ 27 ఏండ్ల కల సాకరమవుతుందని మెజార్టీ ఎగ్జిట్స్ పోల్స్ స్పష్టం చేశాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.