న్యూఢిల్లీ, డిసెంబర్ 28: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలు జరిపిన కాల్పులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న తావి బ్రిడ్జికి సమీపంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఓ ట్రక్కులో ఉగ్రవాదులు కశ్మీర్ వైపు వెళ్తుండగా.. భద్రతా దళాలు సిదరా చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. తనిఖీ చేస్తుండగా భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశారు. 45 నిముషాలపాటు ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరిగాయి. ‘ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు గ్రనేడ్లు కూడా ప్రయోగించారు. చివరకు భద్రతా దళాలు ట్రక్కు వద్దకు చేరుకుని చూడగా అందులో నలుగురు ఉగ్రవాదులు మృతిచెంది ఉన్నారు. ట్రక్కు కూడా మంటల్లో చిక్కుకుంది’ అని జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ ముఖేశ్‌సింగ్ వివరించారు. ఊకతో ఉన్న ట్రక్కును పూర్తిగా పరిశీలిస్తున్నామని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులు ఏ గ్రూప్‌నకు చెందినవారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు ఏడీజీపీ తెలిపారు.