లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. (Sambhal violence) సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్తోపాటు వందలాది మందిని నిందితులుగా పేర్కొన్నారు. బార్క్, సోహైల్ అక్కడి ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించినట్లు జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా, సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆరోపించారు. వారిద్దరితో సహా మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయని మీడియాతో అన్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా వందలాది మంది అల్లర్ల నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని వివరించారు.
కాగా, మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు స్థలంలో గతంలో ఉన్న ఆలయాన్ని కూల్చి దానిని కట్టినట్లు ఒక వ్యక్తి ఆరోపిస్తూ స్థానిక కోర్డును ఆశ్రయించాడు. దీంతో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. తొలుత గత మంగళవారం సర్వే చేయగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.
మరోవైపు ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో మసీదు వద్దకు చేరుకున్న సర్వే బృందాన్ని వేలాది మంది స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ జరుగడంతో స్థానికులు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
కాగా, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించగా 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.