లక్నో: ఒక పోలీస్ అధికారి ఏకంగా జడ్జిని దొంగగా పేర్కొన్నాడు. (cop mistakes judge as thief) ఆ చిరునామాలో వెతికినా కనిపించలేదంటూ కోర్టుకు నివేదిక ఇచ్చాడు. ఆ న్యాయమూర్తి ఇది చూసి కంగుతిన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 2012లో రాజ్‌కుమార్ అలియాస్ పప్పుపై దొంగతనం కేసు నమోదైంది. నాటి నుంచి అరెస్ట్ కాకుండా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. పలుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో రాజ్‌కుమార్‌ను నేరస్థుడిగా ప్రకటించి సంబంధిత సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నగ్మా ఖాన్ పోలీసులను ఆదేశించారు.
కాగా, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) బన్వరీలాల్ కోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించాడు. దానిని పూర్తిగా చదవకుండానే కోర్టుకు నివేదిక ఇచ్చాడు. నిందితుడి పేరుకు బదులు న్యాయమూర్తి నగ్మా ఖాన్ పేరును ప్రస్తావించాడు. ఆ చిరునామాలో వెతికినప్పటికీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నిందితుడ్ని కనుగొనలేకపోయినట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు మార్చి 23న ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. ఎస్ఐ బన్వరీలాల్ కోర్టుకు సమర్పించిన నివేదిక చూసి న్యాయమూర్తి నగ్మా ఖాన్ గందరగోళం చెందారు. నిందితుడి పేరు బదులు తన పేరు ఉండటం చూసి ఆమె షాకయ్యారు. ఆ పోలీస్ అధికారి నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ బన్వరీలాల్ను సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరంగా దర్యాప్తు చేస్తున్నారు.