లక్నో: పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే పాము కాటు నుంచి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. (cop hires snake charmers to kill wife) దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టించుకోకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. అనూజ్ పాల్, అన్షికకు నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించడంతో తనపై అత్యాచారం చేసినట్లు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నుంచి తప్పించుకునేందుకు అన్షికను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఉద్యోగం లేకపోవడంతో భార్యను సోదరి ఇంట్లో ఉంచాడు.
కాగా, కొన్నేళ్ల తర్వాత అనూజ్ పాల్‌కు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే అన్షికను భార్యను స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె మళ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాజీ కుదరడంతో అన్షికను తన ఇంటికి తీసుకొచ్చాడు.
మరోవైపు భర్త అనూజ్ నాటి నుంచి తనను వేధిస్తున్నట్లు భార్య అన్షిక ఆరోపించింది. ఫిబ్రవరి 19న పాములు పట్టేవారిని సంప్రదించి పాముతో తనను కాటు వేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చనిపోయినట్లు భావించి ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత తన పుట్టింటికి వెళ్లి చికిత్స పొందినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో అన్షిక తన తండ్రితో కలిసి డీసీపీని కలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అనూజ్ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆ అధికారి ఆదేశించారు.