Sixth Jyotirlinga | మహా శివరాత్రి మరో మూడు రోజుల్లో జరుపుకునేందుకు సిద్ధమవగా.. అసోం ప్రభుత్వ ప్రకటన వివాదాస్పదంగా మారింది. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని తరించండి అంటూ అసోంలోని బీజేపీ ప్రభుత్వం భక్తులకు పిలుపునిచ్చింది. ఇది ఇంతటితో ఆగిపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరో జ్యోతిర్లింగం అంటూ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో పేర్కొనడమే ప్రస్తుతం ఆందోళనకు కారణం. అసోం ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్పై మహారాష్ట్రలోని ఎన్సీపీ, శివసేన థాక్రే వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
మహా శివరాత్రి పండుగ కోసం అసోం సందర్శించాలని యాత్రికులు, భక్తులను కోరుతూ అసోం ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని ఆరో జ్యోతిర్లింగం అసోం కమ్రూప్లోని డాకిని కొండలలో ఉన్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే పటాన్ని కూడా ప్రకటనలో ముద్రించారు. దీనిలో పుణె భీమశంకర దేవాలయానికి బదులుగా అసోం కమ్రూప్లోని భీమశంకర ఆలయాన్ని చూపించింది. ఈ ప్రకటనను అక్కడి పత్రికల్లో అచ్చువేయించారు. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిజానికి ఆరో జ్యోతిర్లింగం మహారాష్ట్ర పుణెలోని భీమశంకర దేవాలయంలో ఉన్నదని చరిత్రకారులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని భక్తులు కూడా నమ్ముతున్నారు.
ఆరో జ్యోతిర్లింగం అసోంలో ఉన్నదంటూ అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం మహారాష్ట్ర నుంచి దేవుడ్ని హైజాక్ చేసుకువెళ్లడమే అని ఎన్సీపీ, శివసేన థాక్రే వర్గాలు విమర్శిస్తున్నాయి. పుణె భీమశంకర దేవాలయంలో ఉన్న లింగం ఆరో జ్యోతిర్లింగం అని అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ.. అసోం ప్రభుత్వం ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు. ఇప్పటివరకు పరిశ్రమలు, ఉపాధినే బీజేపీ లాక్కుంటున్నదని అనుకున్నామని, ఇప్పుడీ ప్రకటనతో సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని దొంగిలించేందుకు కూడా బీజేపీ సిద్ధమైందని ఆమె ఆరోపించారు. అసోం ప్రభుత్వం ఆది శంకరాచార్య రచించిన బృహత్ రత్నాకర్ స్తోత్రం చదివితే డాకినీ అడవుల మూలం తెలుస్తుందన్నారు.