UPSC Lateral Entry | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’ ప్రకటన వివాదాస్పదమవుతున్నది. ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సోమవారం ఈ విషయమై చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. ల్యాటరల్ ఎంట్రీ ప్రకటన పూర్తిగా తప్పని, ఇందులో ఎలాంటి ‘అయినా, కానీ’లు లేవని కుండబద్ధలు కొట్టారు. తమ పార్టీ ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ నియామకాలు రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తనకు ఈ ప్రకటన గురించి ఆదివారమే తెలిసిందని, తన ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు లాక్కునే కుట్ర: ప్రతిపక్షాలు
ల్యాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా నియామకాలు చేపట్టడం దళిత, ఓబీసీ, ఆదివాసీలపై దాడి అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ వక్రీకరించిన రామరాజ్యం ప్రయత్నిస్తున్నదని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెనుకబడిన వర్గాలను తొలగించేందుకు ఇది పక్కా ప్రణాళికతో చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం ల్యాటరల్ ఎంట్రీ విధానాన్ని తప్పుపట్టారు. ఈ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఈ విధానాన్ని యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండో అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ కమిషన్ ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
ల్యాటరల్ ఎంట్రీ అంటే?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్ ఎంట్రీ’ అంటారు. మూడేండ్లు లేదా ఐదేండ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని 2018లో మొదటిసారి అమలు చేశారు. ప్రస్తుతం పలు విభాగాల్లో జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ తదితర 45 పదవులను భర్తీ చేయడానికి యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది.