హవేరీ: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై వారు మండిపడుతున్నారు. తాము హవేరీ జిల్లాలో గడచిన కొన్ని సంవత్సరాల్లో చేసిన వివిధ పనుల నిమిత్తం తమకు దాదాపు రూ.738 కోట్లు చెల్లించవలసి ఉందని, ఈ సొమ్మును ఈ నెలాఖరుకు చెల్లించకపోతే, కారుణ్య మరణానికి అనుమతి కోరవలసిన పరిస్థితి వస్తుందని జిల్లా కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరించింది.
ఈ సంఘం నేత మల్లికార్జున్ హవేరీ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ‘వివిధ శాఖల్లో కమీషన్ల బెడద విపరీతంగా ఉంది. అధికారులు, మధ్యవర్తులు 10-15 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా అన్ని శాఖల్లో కమీషన్ల బెడద ఉంది. అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. బిల్లులు విడుదల చేస్తారని కమీషన్లు చెల్లిస్తున్నాం. మధ్యవర్తులు మా రక్తం తాగుతున్నారు’ అని పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే సమయంలో బెళగావిలో కాంట్రాక్టర్లు నిరసనలు చేపట్టారని, దశలవారీగా మార్చి చివరినాటికి బిల్లులు చెల్లిస్తామని ప్రజా పనుల శాఖ మంత్రి హామీ ఇచ్చారని మల్లికార్జున్ హవేరీ చెప్పారు. అయితే ఇప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తమ బిల్లులను మంజూరు చేయాలని లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని స్పష్టంచేశారు.
మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలోనూ కాంట్రాక్టర్లు పలుమార్లు నిరసనలు చేపట్టారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కారుణ్య మరణానికి అనుమతించాలని రాష్ట్రపతి, ప్రధానికి కాంట్రాక్టర్లు లేఖలు రాశారు. బీజేపీ సర్కారు దిగిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. పైగా, మునుపటి సర్కారుతో పోలిస్తే సిద్ధరామయ్య ప్రభుత్వంలో అవినీతి మరింత పెరిగిందని వారు వాపోతున్నారు. డీకే శివకుమార్ సహా పలువురు మంత్రుల ఆఫీసుల్లో అవినీతి పెచ్చుమీరిందని, బ్రోకర్లతో ఆఫీసులు నిండిపోయాయని మండిపడుతున్నారు.