బెంగళూరు, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతి పెచ్చరిల్లడంపై కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. బుధవారం ఇక్కడి స్వాత్రంత్య ఉద్యానవనంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు తరలివచ్చారు. బొమ్మై సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ మాట్లాడుతూ.. గతంలో కంటే బీజేపీ పాలనలో అవినీతి భారీ పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా తాము ఏడాదిన్నరగా పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. ‘40% కమీషన్’పై తాము ఆరోపణలు చేసినప్పుడల్లా, ఆధారాలు లేవంటూ ప్రభుత్వం కొట్టివేస్తున్నదన్నారు. అయితే తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, శాంపిల్‌గా రెండు రోజుల కిందటే ఆడియో టేపులను విడుదల చేసినట్టు వెల్లడించారు. ముడుపులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, కాంట్రాక్టర్ ముంజునాథ్ మధ్య జరిగిన సంభాషణ ఆ ఆడియో టేపుల్లో ఉన్నది. గత మూడేండ్లలో తిప్పారెడ్డికి తాను రూ.90 లక్షలు లంచం చెల్లించినట్టు మంజునాథ్ ఆరోపించారు.
కాంట్రాక్టర్లను బలిపశువులను చేస్తున్నారు..
40 శాతం వరకూ కమీషన్ చెల్లిస్తున్నందునే పనులు నాసిరకంగా ఉంటున్నాయని, ఆ పనుల్లో ఏవైనా అనర్థాలు జరిగినప్పుడు కాంట్రాక్టర్లను బలిపశువులను చేస్తున్నారని కెంపణ్ణ ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్ల వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.25 వేల కోట్ల కాంట్రాక్టు బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.