బెంగళూరు, మే 31: కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వంపై నమ్మకంతో అప్పోసప్పో చేసి పనులు చేసినా బిల్లులు రాక, కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని గతంలో బొమ్మై సర్కారుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారికి బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి తలెత్తింది. తాజాగా, దేవనగెరెకు చెందిన జీ ప్రసన్న(50) అనే కాంట్రాక్టరు సంతెబెన్నూర్లో ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు కారణాలను ఓ లేఖలో రాశారు. తాను చేసిన పనులకు సంబంధించి కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ లిమిటెడ్(కేఆర్ఐడీఎల్) నుంచి బిల్లులు రావడం లేదని, తన సోదరులు నాగరాజ్, శ్రీనివాస్ తీసుకున్న డబ్బులు తిరిగిఇవ్వడం లేదని లేఖలో రాశారు. మొత్తంగా తనకు రూ.80 లక్షలు రావాల్సి ఉందని వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేఆర్ఐడీఎల్ అధికారులు, శ్రీనివాస్, నాగరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.