బీదర్: కర్ణాటకలోని బీదర్‌లో కాంట్రాక్టర్ సచిన్ పాంచాల్ (26) గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన సూసైడ్ నోట్లో మాజీ కౌన్సిలర్ రాజు కాపనూర్, మరో ఏడుగురు తన ఆత్మహత్యకు బాధ్యులని ఆరోపిం చారు. ఇదిలావుండగా, రాజు కాపనూర్ కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు సన్నిహితుడని తెలిసింది. ఈ వార్తపై ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, వాస్తవాలు బయటకు రావాలని, దీనిపై దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. ఖర్గే కార్యాలయం తమ వాట్సాప్ గ్రూప్ లో రాజు వీడియోను పోస్ట్ చేసింది. తనను సచిన్ పెద్ద ఎత్తున మోసం చేశాడని రాజు చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఖర్గే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఎక్స్ పోస్ట్‌లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు తమ అనుయాయులకు, సన్నిహితులకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాసి ఇచ్చినట్లు కనిపిస్తున్నదని ఆరోపించారు.