న్యూఢిల్లీ, మే 30: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)లో డిజిటల్ సంస్కరణ ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావించినప్పటికీ అది దేశవ్యాప్త వివాదంగా మారింది. గతంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన సంస్థ గ్లోబరీనాకు కాంట్రాక్ట్ కట్టబెట్టి అభాసుపాలైంది. సీబీఎస్ఈ స్కాన్ చేసిన జవాబు పత్రాలలో తప్పులు, పునర్మూల్యాంకనం సమయంలో సమస్యలు ఎదురయ్యాయని ఆరోపిస్తూ స్క్రీన్షాట్లు, బీడియోలు, పోస్టులతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నిండిపోయాయి. సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానాన్ని నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యు టెక్ సంస్థ(గతంలో గ్లోబరీనా) ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నదని వెలుగులోకి వచ్చింది. సాంకేతిక వైఫల్యాలు, అస్పష్టంగా ఉన్న జవాబు పత్రాలు, స్కాన్ చేసిన కాపీలలో పొరపాట్లు జరిగాయని ఆన్లైన్లో వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 2026 బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివాదాన్ని ఎదుర్కొంటున్న కోఎంప్ట్ ఎడ్యు టెక్ సంస్థ గతంలో గ్లోబరీనా టెక్నాలజీస్‌గా పనిచేసింది. 2019లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు బయటపడిన తర్వాత తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల వివాదం సమయంలో ఈ సంస్థ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది.
టీచర్లు నివేదించిన సమస్యలు
సీబీఎస్ఈ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొన్న ఉపాధ్యాయులు స్కాన్ చేసిన జవాబు పత్రాల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా కథనాల ప్రకారం ఆన్లైన్లో పేపర్లను తనిఖీ చేస్తున్నపుడు పలువురు టీచర్లు అస్పష్టమైన చిత్రాలు, డూప్లికేట్ ఎంట్రీలు, స్కానింగ్ లోపాలను గుర్తించారు. నాసిరకం స్కాన్ నాణ్యత, సాంకేతిక సమస్యల కారణంగా దాపు 3 జవాబు పత్రాలను తిరస్కరించవలసి వచ్చిందని ఒక ఉపాధ్యాయుడు న్యూస్ 18తో అన్నారు.
కొత్త ఓఎస్ఎం విధానం?
ఇటీవల ముగిసిన విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ మొదటిసారిగా ఓఎస్ఎం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం కింద విద్యార్థులు రాసిన రాతపూర్వక జవాబు పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయులు కాగితపు ప్రతులను చేతితో తనిఖీ చేయడానికి బదులుగా వాటిని డిజిటల్‌గా మూల్యాంకనం చేయగలుగుతారు. మూల్యాంకనం ప్రక్రియలో వేగం, కచ్చితత్వం, పారదర్శకతను మెరుగుపరిచేందుకే ఈ చర్య చేపట్టినట్టు బోర్డు తెలిపింది.
సీబీఎస్ఈ పేమెంట్ పోర్టల్‌పై సైబర్ దాడి
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌పై సెబర్ దాడి జరిగిందని, దీనివల్ల దాదాపు 50 మంది విద్యార్థులు ప్రభావితులయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు పేమెంట్ గేట్వేగా హెచ్డీఎఫ్సీ ఉన్నది. దాంతోపాటు నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను కూడా అదనపు పేమెంట్ గేట్‌వేలుగా అనుసంధానించారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ పేమెంట్ గేట్‌వే పోర్టల్‌పైనే దాడి జరిగింది. హ్యాకింగ్ తర్వాత దాదాపు 50 మంది వరకు పిల్లలు లాగిన్ అయ్యారు. సమస్య కారణంగా పోర్టల్‌లో రీ వాల్యుయేషన్ ఫీజు రూ.68 వేల వరకు చూపించింది. సరదా కోసం లేదా దురుద్దేశంతో ముందు ఒక రూపాయిగా చూపించి తర్వాత రూ.68 వేల వరకు చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నిపుణులు సమస్యపరిష్కారానికి కృషి చేస్తున్నారు.
20 జవాబు పత్రాలు తారుమారు
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇప్పటివరకు 20 మంది విద్యార్థుల పేపర్లు తారుమారైనట్టు సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించింది. అలాగే నిర్దేశిత ప్రమాణాల్లో స్కానింగ్ కాని 13 వేలకు పైగా జవాబు పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించనున్నట్టు తెలిపింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఓఎస్‌ఎంపై పరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీబీఎస్ఈ స్పందించింది. మొత్తం 98 లక్షల జవాబు పత్రాల బుక్లెట్లకు సంబంధించి 40 కోట్ల పేజీల స్కానింగ్ జరిగిందని, 68 వేల పత్రాల స్కానింగ్‌లో నాణ్యత లోపించినట్టు గుర్తించామని, వాటిని తిరిగి స్కాన్ చేస్తామని పేర్కొన్నది.