న్యూఢిల్లీ: సమాజంలోని అసమానతలను పరిష్కరించకుండా ఏ దేశమూ నిజమైన ప్రగతిశీల లేదా ప్రజాస్వామ్యమైన దేశంగా చెప్పుకోలేదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం, సామాజిక ఐక్యత, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడనానికి సామాజిక న్యాయం ఒక ఆచరణాత్మక అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ‘దేశంలో సామాజిక-ఆర్థిక న్యాయం అందించడంలో రాజ్యాంగం పాత్ర- 75 ఏండ్ల భారత రాజ్యాంగం నుంచి ప్రతిబింబాలు’ అంశంపై బుధవారం మిలాన్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఇది కేవలం పునర్విభజన లేదా సంక్షేమానికి సంబంధించిన విషయం కాదని, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించడానికి, దేశ, సామాజిక, రాజకీయ జీవితంలో సమానంగా పాల్గొనడానికి వీలు కల్పించడం గురించి కూడా అని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రజలకు దార్శనికత, నైతిక మార్గదర్శకాన్ని అందించిందని, చట్టం వాస్తవానికి సామాజిక మార్పుకు ఒక సాధనంగా, సాధికారితకు ఒక శక్తిగా, దుర్భల వర్గాలకు రక్షకుడిగా ఉంటుందని చూపించిందని సీజేఐ గవాయ్ పేర్కొన్నారు.