Mumbai | ముంబై: ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే ఎజెండాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందని అన్నారు.
కొవిడ్-19 సంక్షోభం, నోట్ల రద్దు, మణిపూర్ హింసాకాండ అంశాలపై ఏర్పాటు చేయని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఇప్పుడు ఎందుకు? అని నిలదీశారు. ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉన్నదని నానా పటోలే అన్నారు. అటువంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోతున్నదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేసే కుట్రలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్‌లో ఉన్నదని పేర్కొన్నారు.