న్యూఢిల్లీ: అస్సాం, త్రిపుర వ్యాప్తంగా విస్తరిస్తున్న బంగ్లాదేశ్తో సంబంధం ఉన్న జిహాదీ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు తమ దర్యాప్తులో నిందితుల నుంచి సేకరించిన దిగ్భ్రాంతికర వివరాలను వెల్లడించారు. అస్సాం, త్రిపురతోపాటు పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో జిహాదీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మతోన్మాద భావాల ప్రచారం, నిధుల సేకరణ, జిహాద్ పేరిట హింసాత్మక సాయుధ చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు వారు చెప్పారు. ఇటీవల స్పెషల్ టాస్క్ ఫోర్సు, సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంయుక్తంగా దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో 10 మంది అస్సాంలో, ఒకడు త్రిపురలో దొరికారు.