అహ్మదాబాద్: నకిలీ టోల్ ప్లాజా, నకిలీ బ్యాంకు, నకిలీ పోలీస్ స్టేషన్ తర్వాత తాజాగా గుజరాత్లో నకిలీ కోర్టు వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్‌నే ఏర్పాటు చేసి జడ్జిగా అవతారమెత్తి తీర్పులు కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిందీ ఘటన. ఇందుకోసం నిందితుడు తన ఆఫీసు రూమును అచ్చం కోర్టు రూములా మార్చేశాడు. ఓ ప్రభుత్వ భూమికి సంబంధించి 2019లో తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చేశాడు. ఈ కేసులో ఏకంగా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీచేసి దొరికిపోయాడు. నిందితుడిని మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌గా గుర్తించారు. గత ఐదేళ్లుగా అతడు ఇదే పనిలో ఉన్నట్టు గుర్తించారు. అతడిచ్చిన ఉత్తర్వులను నకిలీవిగా గుర్తించిన సిటీ సివిల్‌కోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల కేసులకు సంబంధించిన వ్యక్తులను ట్రాప్ చేసి తన కోర్టుకు రప్పించుకునేవాడు. త్వరితగతిన పరిష్కారాలు చూపుతానని చెప్పి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది. అతడి సహచరులు కోర్టు సిబ్బందిగా వ్యవహరించేవారు. కాగా, 2015లోనే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.