Lok Sabha Protem Speaker | 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ పేరు ఖరారైనట్లు తెలుస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయనను ప్రొటెం స్పీకర్గా నియమిస్తే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాక ముందే.. సురేష్తో రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయిస్తారు. 18వ లోక్ సభ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులతో తొలుత ఎంపీలుగా ప్రమాణం చేయిస్తారు. అటుపై ఇతర పార్టీల ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. కేరళలోని మావెలికర స్థానం నుంచి సుదీర్ఘ కాలం లోక్ సభకు కే సురేష్ (68) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నెల 26న లోక్ సభ స్పీకర్ అభ్యర్థిని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని అధికార వర్గాల కథనం. స్పీకర్ పదవి కోసం 17వ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన భర్తృహరి మహతాబ్, దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. భర్తృహరి మహతాబ్.. ఎన్నికల ముందు ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బిజూ జనతాదళ్ నుంచి బీజేపీలో చేరారు. దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు.