Banaskantha | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెనిబెన్ ఠాకూర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి రేఖా చౌదరిని ఓడించారు. మంగళవారం లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బనస్కాంత లోక్ సభ స్థానం నుంచి జెనిబెన్ ఠాకూర్.. తన బీజేపీ ప్రత్యర్థి రేఖా చౌదరిపై 30 వేల మెజారిటీతో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల మాదిరిగా మూడోసారి మొత్తం 26 స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలన్న బీజేపీ లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీ గండి కొట్టింది. బనస్కాంత లోక్ సభ స్థానం బీజేపీకి సంప్రదాయంగా పెట్టని కోట. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పార్బాత్భాయి పటేల్.. తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్థీ భాటోల్ మీద 3.68 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందింది.