Rahul Vs Anurag | న్యూఢిల్లీ, జూలై 31: లోక్‌సభలో ‘కుల’ వివాదం ముదురుతున్నది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్.. ‘వారి కులం ఏంటో కూడా తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఠాకూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా తప్పుపట్టారు. లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. ఈ వివాదం బుధవారం కూడా కొనసాగింది. ఠాకూర్ ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయకపోయినా రాహుల్ గాంధీ ఆయనను అవమానించారని అనడం ఆశ్చర్యకరమని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.
లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించిన అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యల వీడియోను ప్రధానమంత్రి మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘనకు అనుమతించాలని కోరారు.