Mani Shankar Aiyar | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కాంగ్రెస్ పార్టీలో తన ఉత్థాన పతనాలలో గాంధీ కుటుంబం పాత్ర ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వెల్లడించారు. తన రాజకీయ జీవితాన్ని తయారు చేసిందీ, దెబ్బతీసిందీ గాంధీ కుటుంబమే కావడం తన జీవితంలో విషాదమని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబానికి చెందిన ముఖ్యులతో నేరుగా మాట్లాడి చాలా ఏళ్లు గడిచాయని ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
సోనియా గాంధీని నేరుగా కలుసుకోవడానికి 10 సంవత్సరాలో ఒక్కసారి కూడా తనకు అవకాశం ఇవ్వలేదని, ఒకే ఒక్కసారి రాహుల్ గాంధీతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ప్రియాంక గాంధీని ఒకటి రెండు సందర్భాలలో కలుసుకున్నట్లు ఆయన తెలిపారు. అప్పుడప్పుడు ప్రియాంక గాంధీ తనను ఫోన్లో పలకరిస్తారని, ఈ ఒక్కటే ఆ కుటుంబంతో తనకు ఉన్న సంబంధమని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక ద్వారా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాహుల్‌తో నేరుగా మీరే మాట్లాడవచ్చు కదా అని ఒకసారి ప్రియాంక తనతో అన్నారని, అయితే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ నాయకులతో నేరుగా ఎలా మాట్లాడగలనని తాను ఆమెతో అన్నట్లు అయ్యర్ చెప్పారు. ఇలా ఉండగా యూపీఏ 2 ప్రభుత్వ పగ్గాలను ప్రణబ్ ముఖర్జీకి, రాష్ట్రపతి పదవికి మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేసి ఉంటే దేశ రాజకీయాలు వేరేగా ఉండేవని మణిశంకర్ అయ్యర్ తన తాజా పుస్తకం మావెరిక్ ఇన్ పాలిటిక్స్‌లో వెల్లడించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.