న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో పాటు పోస్ట్ కొవిడ్ లక్షణాలకు చికిత్స పొందుతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ సోకడం, ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. సోనియాకు ఆస్పత్రిలో వైద్యులు సర్జరీ నిర్వహించారు.
జూన్ 1న సోనియాకు నిర్వహించన పరీక్షలో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి జూన్ 23న విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఈడీ గత మూడు రోజులుగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ సోమవారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.