న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేయడంపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతోనే ముందుకు వెళుతోందని ఆరోపించింది. వాస్తవ అంశాలను మరుగునపరిచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి దుయ్యబట్టారు.
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ దాడుల నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ అన్నింటినీ సీల్ వేసే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలతో కేంద్రం తమ గొంతులను నొక్కలేదని సింఘ్వి పేర్కొన్నారు. విపక్షంగా తమ బాధ్యత నుంచి తాము ఎప్పుడూ పక్కకు తప్పుకోబోమని స్పష్టం చేశారు.
మీరు ఎంతగా తమను అణిచివేయాలని చూసినా మీ తప్పిదాలను బయటపెడుతూనే ఉంటామని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విధానం కాదని, తాము ఎక్కడికి పారిపోవడం లేదని వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.