ఆ రెండు పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో మిత్ర పక్షాలు.. కానీ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఆ రెండు పార్టీల మధ్య గురువారం మాటల యుద్ధం సాగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఇవ్వడానికి మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని వార్తలొచ్చాయి. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. ‘మాకు మమతా దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు.
అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపైనా పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే స్పందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా పొందలేదని, తన పునాదిని పూర్తిగా కోల్పోయిందని గుర్తు చేసింది.
తొలి నుంచి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేయడంలో అధిర్ రంజన్ చౌదరి ముందు ఉంటారు. ‘మమతా బెనర్జీ మనస్సులో మాట బయటకు వచ్చింది. వారు మాట్లాడుతున్న ఒకటి రెండు సీట్లు గత ఎన్నికల్లో తృణమూల్, బీజేపీపై పోరాడి కాంగ్రెస్ నేతలు గెలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరిన్ని సీట్లు గెలిచే సామర్థ్యం ఉంది’ అని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.