Mallikarjun Kharge | బెంగళూరు, ఆగస్టు 29: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూకేటాయింపు వివాదం రాజకీయ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ఈ ట్రస్టుకు భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కిందని, అర్హతలు చూడకుండా ప్రభుత్వం భూమి కేటాయించిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఈ ఆరోపణలను బలపరిచే అంశాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. అడిగిన విస్తీర్ణం కంటే ఎక్కువ భూమిని కేటాయించడం, మిగతా దరఖాస్తులను పక్కనపెట్టేసి ఒకే దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ముడా భూకేటాయింపు, వాల్మీకి బోర్డు కుంభకోణాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠను ఈ ఆరోపణలు మరింత పలుచన చేస్తున్నాయి.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన భార్య, కుమారులు, అల్లుడు సభ్యులుగా ఉన్న సిద్ధార్థ విహార్ ట్రస్టుకు బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ప్రజా వసతులు కల్పించడానికి ఉద్దేశించిన 45.94 ఎకరాల స్థలంలో 5 ఎకరాల స్థలాన్ని కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు(కేఐఏడీబీ) కేటాయించింది. మల్టీ స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ పెట్టేందుకు భూమి కావాలని ఈ ట్రస్టు దరఖాస్తు చేసుకుంది.
2.17 ఎకరాల ప్లాటు లేదా 5 ఎకరాల మరో ప్లాటు కేటాయించాలని ఈ ట్రస్టు రెండు ప్రతిపాదనలు పెట్టింది. చిన్న స్థలం అయినా సరిపోతుందని అడిగినప్పటికీ కేఐఏడీబీ మాత్రం పెద్ద స్థలం కేటాయించడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ స్థలాన్ని కేటాయించిన రాష్ట్రస్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీకి చైర్మన్‌గా మంత్రి ఎంబీ పాటిల్ ఉన్నారు. ఈ భూకేటాయింపులో బంధుప్రీతి, పక్షపాతం ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ స్థలంలో మల్టీ స్కిల్ డివలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి రూ.25 కోట్ల వ్యయం అవుతుందని ఈ ట్రస్టు సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నది. ఇందులో రూ.10 కోట్లు ప్రమోటర్లు పెట్టుబడి పెడతారని, మరో రూ.10 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటామని, రూ.5 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా పెడతామని ట్రస్టు పేర్కొన్నది. అయితే, రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రమోటర్లు ఎవరనే విషయాన్ని వెల్లడించకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సెంటర్లో యువతకు ఆటోమొబైల్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని ట్రస్టు పేర్కొన్నది. అయితే, ఈ రంగంలో ట్రస్టుకు ఉన్న అనుభవానికి సంబంధించిన ఆధారాలను మాత్రం సమర్పించలేదని దినేశ్ కల్లహళ్లి అనే సామాజిక కార్యకర్త ఆరోపించారు. మిగతా దరఖాస్తులు అన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఈ ఒక్క ట్రస్టు దరఖాస్తును మాత్రమే కమిటీ పరిగణనలోకి తీసుకున్నదని, ఇది బంధుప్రీతి, అవినీతి అని దినేశ్ పేర్కొన్నారు.