చండీగఢ్: ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి విజయం సాధించింది. ఇప్పుడు హర్యానాలో మరో అడుగు ముందుకేసి ఏడు గ్యారెంటీలను ప్రకటించింది. కర్ణాటకలో ఇటీవల లోక్సభ ఎన్నికల వేళ ఐదు గ్యారెంటీల అమలు ప్రారంభించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటికి నిధులు ఎలా సమీకరించాలో తెలియక నానాపాట్లు పడుతున్నది.
గ్యారెంటీలు ఎత్తేయాలని ఆ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒకటీ రెండు గ్యారెంటీల మినహా మిగతా వాటి ఊసే ఎత్తడం లేదు. ఈ రెండు రాష్ర్టాలకు గ్యారెంటీలు భారంగా మారినా, ఇవి అమలు చేయడం కష్టమని తెలిసినా హర్యానాలో మరిన్ని ఎక్కువ హామీలను ప్రకటించింది. అక్టోబరు 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఏడు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ శనివారం పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇందులో భారీగా హామీలు గుప్పించింది.
ఏడు గ్యారెంటీలు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 18-60 ఏండ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు 200 గజాల స్థలంలో రెండు గదుల ఇల్లు, యువతకు 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కులగణన, పాత పింఛన్ విధానం అమలు వంటివి కాంగ్రెస్ హామీల్లో ప్రధానమైవి.