న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగులకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ‘యువ ఉడాన్ యోజన’ పథకం కింద ఏడాది పాటు ఈ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. యువతకు కంపెనీల్లో శిక్షణతోపాటు ఈ ఆర్థిక సహాయాన్ని వాటి ద్వారా అందజేస్తామని పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఎన్నికల (Delhi Polls) హామీ పోస్టర్లను విడుదల చేశారు.
కాగా, ఈ పథకం గురించి సచిన్ పైలట్ వివరించారు. ఇది ఉచిత స్కీమ్ కాదని తెలిపారు. ‘ఒక కంపెనీ, ఫ్యాక్టరీ లేదా సంస్థలో నైపుణ్యాలను ప్రదర్శించే యువతకు మేం ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ కంపెనీల ద్వారానే వారు ఆ డబ్బు పొందుతారు. ఇది ఇంట్లో కూర్చొని డబ్బు పొందే పథకం కాదు’ అని అన్నారు. శిక్షణ పొందిన రంగాల్లో యువత రాణించడమే ఈ పథకం ఉద్దేశమని ఆయన తెలిపారు. తద్వారా నైపుణ్యాలను వారు మెరుగుపరుచుకునేందుకు ఇది దోహదం చేస్తుందని అన్నారు.
మరోవైపు జనవరి 6న ‘ప్యారీ దీదీ యోజన’ను కాంగ్రెస్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే జనవరి 8న ‘జీవన్ రక్షా యోజన’ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చింది.
కాగా, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.