బెంగళూరు, జూన్ 30: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని, ఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అక్టోబర్‌లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు సోమవారం ఖర్గేని ప్రశ్నించగా ఇది అధిష్టానం(హైకమాండ్) చేతుల్లో ఉందని ఆయన అన్నారు. హైకమాండ్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని హైకమాండ్‌కే వదిలిపెట్టాము. తదుపరి కార్యాచరణను తీసుకునే అధికారం దానికే ఉంది. అనవసరంగా సమస్యను సృష్టించవద్దుఅని ఆయన విలేకరులకు తెలిపారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఎద్దేవా చేసింది. ఎవరికీ కనపడని, ఎవరికీ వినిపించని ఈ హైకమాండ్ ఎవరని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కాంగ్రెస్ అధ్యక్షుడిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకపోతే ఎవరీ హైకమాండ్ అని ఎక్స్ వేదికగా సూర్య ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఓ దెయ్యం లాంటిది. అది కనపడదు.. వినపడదు. కాని అది ఉన్నట్లు భ్రమింపచేస్తుంది. అధ్యక్షుడు ఖర్గే హైకమాండ్ అని ప్రజలు భావిస్తారు. కాని ఆయనే తాను కాదని చెబుతున్నారు అంటూ సూర్య ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకా స్పందిస్తూ ఖర్గే కాకపోతే పార్టీ హైకమాండ్ ఎవరని ప్రశ్నంచారు. మీరు కాకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరో ఒకరా లేక ఓ ఇంటిపేరుతో కూడిన కనిపించని కమిటీనా అని ఎక్స్‌లో ఆయన ఖర్గేని ప్రశ్నించారు.