న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పునరుద్ధరించారు. ఆగస్టు 20న భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాజీవ్‌గాంధీ జయంతి కావడంతో.. అదే రోజు ఖర్గే వర్కింగ్ కమిటీని పునరుద్ధరించారు. ఈ కమిటీలో కొత్తగా పార్టీ సీనియర్ నేతలైన సచిన్ పైలట్, శశిథరూర్, ఆనంద్ శర్మ, ఏపీకి చెందిన సీనియర్ నేత ఎన్ రఘువీరారెడ్డి, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ తదితరులకు చోటు కల్పించారు.
పైన పేర్కొన్న నాయకులేగాక నజీర్ హుస్సేన్, అల్కా లాంబా, సుప్రియా శ్రీనాథే, ప్రణీతి షిండే, పవన్ ఖేహ్రా, గణేశ్ గొడియాల్, యశోమతి ఠాకూర్ పేర్లను కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల జాబితాలో చేర్చారు. సీనియర్ నాయకులు వీరప్ప మొయిలీ, మనీశ్ తివారీల పేర్లు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. కాగా, మొత్తం 39 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది.
ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీకి చెందిన పల్లంరాజును, తెలంగాణ నుంచి వంశీచంద్ రెడ్డిని ఖర్గే నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా బీ సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులకు అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.