Congress Meet : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ని ఎదుర్కొనే వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదును పెడుతోంది. ఏప్రిల్లో జరగనున్న ఏఐసీసీ (AICC) కీలక సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలను ఒక్క చోటకు చేర్చి కాషాయ పార్టీపై కదం తొక్కేందుకు సమాయత్తం అవుతోంది.
గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా వచ్చే ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలవల్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై ఆ పార్టీ చేస్తున్న దాడులను ఎదుర్కొనే వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపింది.
గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ (CWC) సమావేశం, 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. ఈ భేటీలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షత వహిస్తారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏఐసీసీ ప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారని వెల్లడించారు.