Akhilesh Yadav | త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, ప్రతిపక్ష `ఇండియా` కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యవహారంపై కలకలం చెలరేగుతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు చిన్న పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని ఫకీర్‌పురా గ్రామంలో జరిగిన జన్ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ వంటి సీనియర్ నేతలతో మాట్లాడి, వారిని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని అఖిలేష్ అన్నారు. చిన్న పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఎంతో ఉందని వ్యాఖ్యానించారు.
బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమితో కలుస్తారని తాము భావించడం లేదని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఇండియా కూటమిని నితీష్ కుమార్ బలోపేతం చేస్తారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో విజయం కోసం మంచి పొత్తు కుదిరిందన్నారు. సీట్ల పంపకాల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కన్నౌజ్ నుంచి ఎస్పీ పోటీ చేస్తుందని, బీజేపీని తరిమి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో పెరిగిపోవడంతో జ్ఞాన వాపి సర్వే అంశాన్ని ముందుకు తెస్తున్నారని కేంద్రం తీరుపై మండి పడ్డారు. దేశ ప్రజల ఐక్యత విచ్చినానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.