న్యూఢిల్లీ : సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్పీజీ, ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ బృందం సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాబోయే సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు నిర్ణయించారు.
సామాన్యులకు భారంగా మారుతున్న ధరల పెరుగుదలతో పాటు పలు సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రాధాన్యం నిర్ణయించినట్లు ఖర్గే సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ అంశాన్ని సైతం లేవనెత్తనున్నట్లు చెప్పారు. పార్టీ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమై.. ఆగస్ట్ 12 వరకు కొనసాగనున్నాయి.
దేశంలో నిరుద్యోగం, రూపాయి పతనంతో పాటు తూర్పు లఖడ్లోని సరిహద్దు వెంట పరిస్థితులపై కాంగ్రెస్ పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేయనున్నది. వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన సందర్భంలో కనీస మద్దతు ధరకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై కాంగ్రెస్ కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో వైపు పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుడి ఎన్నికపై సైతం చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, పీ చిదంబరం, జైరాం రమేశ్, కే సురేష్, మాణికం ఠాగూర్ పాల్గొన్నారు.