Congress : తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి. 22 ఏళ్లుగా కలిసున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు విడిపోయాయి. ఇకపై కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని డీఎంకే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతోనే కాకుండా.. ఆ పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న ఇండీ కూటమి నుంచి కూడా బయటకు వస్తున్నట్లు డీఎంకే తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేశాయి. అయితే, ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ.. టీవీకేకు మద్దతు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే కూటమికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేతలు విమర్శించారు. కాంగ్రెస్ తన స్వభావాన్ని మార్చుకోలేదన్నారు. తమతో కూటమిలో ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీలు దక్కారని డీఎంకే నేతలు గుర్తు చేశారు. ఇక, తాజాగా డీఎంకే కూడా అవసరమైతే ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఈ కారణాలతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఏళ్లుగా ఉన్న బంధానికి తెరపడింది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
తాము కాంగ్రెస్ పార్టీతో కూటమిలో లేమని, అందువల్ల కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోలేమని చెప్పారు. దీంతో తమకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని లేఖలో కోరారు. తమ ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఎంపీల పక్కన డీఎంకే ఎంపీలు కూర్చోవడం సరికాదని ఆమె లేఖలో అభిప్రాయపడ్డారు. మరోవైపు డీఎంకే నుంచి బయటకు వచ్చి, టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనం అన్నారు.