ముంబై: కాంగ్రెస్ ఎంపీ కుమారుడు కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ కేసులో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీ కుమారుడు హాస్పిటల్లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (MP’s son hospitalised after arrest) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ శనివారం కారు నడిపాడు. చెంబూర్‌లోని గోవండి శివారులో రోడ్డు పక్కన నడుస్తున్న గోపాల్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలకు గాయమైన గోపాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారుతో ఢీకొట్టిన కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ కుమారుడు గణేష్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అరెస్టైన కొంత సేపటి తర్వాత ఎంపీ కుమారుడు గణేష్ అస్వస్థతకు గురయ్యాడు. అతడి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో జేజే హాస్పిటల్లో అతడ్ని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.