కాలిఫోర్నియా: పునర్విభజన ప్రక్రియ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఆ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) స్పందించారు. దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్‌కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న స్టాన్ఫోర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లోక్‌సభ సంఖ్యను 850కి పెంచితే అప్పుడు చైనా పార్లమెంట్ తరహాలో బల్లలు బాదడం తప్ప ఏమీ ఉండదన్నారు. ఎంపీలకు మాట్లాడేందుకు, వాదించేందుకు, చర్చించేందుకు అవకాశం ఉండదని, 850 ఓ జోక్ అని శశిథరూర్ అన్నారు. 1929 నుంచి అమెరికా జనాభా మూడు రెట్లు పెరిగిందని, కానీ అమెరికా చట్టసభలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంఖ్య 435గానే ఉందన్నారు. 850 మందితో డిబేట్ చేయలేమన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును , డీలిమిటేషన్‌తో ముడి పెట్టరాదన్నారు. 2027 నుంచి 2029 మధ్య రిలీజయ్యే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. 2034 నాటికి దేశంలో కొత్త రాజకీయ ముఖాచిత్రం ఉంటుందన్నారు.
ఇదే కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బీజేపీ నేత, ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ డీలిమిటేషన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియ అన్నారు. పార్లమెంట్లో ఎంపీల సంఖ్యను 543కు కట్టడి చేయడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుత జనాభా 140 కోట్లు ఉందని, కానీ 1971 నాటి జనాభా ప్రకారం లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. మరో బీజేపీ నేత కే అన్నామలై మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో భిన్న సమస్యలు వస్తాయన్నారు. తమిళనాడులో ఫెర్టిలిటీ రేటు తగ్గిందని, ఇక జనాభా లెక్కలు రిలీజైన తర్వాత సహజంగానే ఉత్తరాదికి ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు వెళ్తాయన్నారు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు.