Priyanka Gandhi | న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తన మొట్టమొదటి పార్లమెంట్ ప్రసంగంలోనే పెద్ద తప్పులో కాలేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడి, చివరకు సొంత పార్టీనే ఇరుకున పడేశారు. శుక్రవారం లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రైతులను విస్మరించి బడా వ్యాపారులకు అనుకూలంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రియాంక దుయ్యబట్టారు. అయితే ఆమె సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే హిమాచల్‌లో అధికారంలో ఉందన్న విషయాన్ని ఆమె మరిచిపోవడం విశేషం.
ప్రియాంక ప్రసంగిస్తూ దేశంలో రైతులు వరుణదేవుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని, హిమాచల్‌లో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలన్నీ బడా వ్యాపారులకు అనుకూలంగా మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. హిమాచల్‌లో ఆపిల్స్‌ను పండించే చిన్న రైతులకు కన్నీరే మిగులుతోందని, ఒక వ్యక్తి కోసం విధానాలన్నిటినీ మార్చేశారని ఆమె ఆరోపించారు.
ఎంపీగా తన మొదటి ప్రసంగంలోనే ప్రియాంకా గాంధీ తడబాటుకు గురై సొంత ప్రభుత్వాన్నే విమర్శించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘హిమాచల్ ప్రదేశ్‌లో సొంత పార్టీ అధికారంలో ఉందని తెలుసుకోకుండానే ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’, ‘ఆమె పప్పు కంటే పెద్ద పప్పులా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, తమ నాయకురాలి మొదటి ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీలు, ఆ పార్టీ నేతలు సైతం ఆసక్తిగా ఎదురుచూడగా, ఆమె సొంత ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఉసూరుమన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, వింత పన్నులతో వస్తున్న వ్యతిరేకతతో ఇబ్బంది పడుతున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రియాంక వ్యాఖ్యలతో మరింత ఇరుకునపడింది.