Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాషాయ పార్టీని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హరియాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. దీపీందర్ హుడా గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారం నుంచి వైదొలగుతున్నామని బీజేపీ నాయకత్వంతో పాటు మనోహర్ లాల్ ఖట్టర్కూ అర్ధమైందని అన్నారు.
పార్టీకి తమ పట్ల గౌరవం లేదని, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తెరిగారని చెప్పారు. హరియాణలో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరడం ఖాయమని, తమ పార్టీ అంతర్గత అంచనాలతో పాటు క్షేత్రస్ధాయి పరిస్ధితులు, మీడియా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ అవినీతి పార్టీలని హరియాణ సీఎం నయాబ్ సింగ్ సైనీ ఆరోపించారు.
హరియాణ ప్రజల సంక్షేమం కోసం ఈ పార్టీలు పనిచేయవని, అవినీతితో తమ జేబులు నింపుకోవడమే ఈ పార్టీల అజెండా అని విమర్శించారు. అథ్లెట్లు, యువత, రైతులు, పేదల పేరుతో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వారి అభ్యున్నతికి పాటుపడలేదని దుయ్యబట్టారు. ఆయా వర్గాలను మోసగించడమే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. హరియాణ ప్రజలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భారీ మెజారిటీతో కాషాయ పార్టీ హరియాణలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి పాటుపడిందని చెప్పారు.
Read More :