బెంగళూరు, ఫిబ్రవరి 10: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ నాయకత్వ పోరు ముదిరింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. సోమవారం నాడిక్కడ ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్న ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో వ్యవహరించాలని యతీంద్రను ఆయన కోరారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని 80-90 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.
తుది నిర్ణయం అధిష్ఠానానికే వదిలిపెట్టామని ఆయన అన్నారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తామంతా మర్యాదగా ప్రవర్తించాలని ఇక్బాల్ అన్నారు. పదే పదే తన తండ్రి గురించి మాట్లాడుతూ అధిష్టాన వర్గాన్ని ఇరకాటంలో పెడుతున్న యతీంద్ర అంటే తమకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. డీకే శివకుమార్‌కు ఒక అవకాశం ఇవ్వాలని తామంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తామంతా అది జరగాలని ఆశిస్తున్నామని, కాని తాము తమ ప్రకటనలతో ఎటువంటి గందరగోళం ఏర్పడకూడదనే మౌనం వహిస్తున్నామని ఇక్బాల్ తెలిపారు. ఈ పదవీ కాలంలోనే డీకేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని తాను మొదటి రోజు నుంచి కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
యతీంద్ర సిద్ధరామయ్య గత వారం చేసిన కొన్ని వ్యాఖ్యలతో మళ్లీ రాష్ట్రంలో నాయకత్వ వివాదం రాజుకుంది. పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు తన తండ్రి సిద్ధరామయ్యకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు యతీంద్ర ప్రకటించారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ ఆయన(యతీంద్ర) ఏం చెప్పినా గౌరవంతో ఆమోదిస్తాను. తానే పార్టీ అధిష్ఠానంగా ఆయన మాట్లాడుతున్నందున నేను కూడా ఆమోదిస్తున్నాను అని డీకే వ్యాఖ్యానించారు.