గువాహటి: అసోంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత వాదన వినిపించారు. తాను తన నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని, కానీ అధికారికంగా మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఎమ్మెల్యే వాదనను అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ సమర్థిస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్కు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోతానన్న భయంతోనే ఎమ్మెల్యే వింత ఎత్తుగడ వేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ అసోం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు సమావేశాలు కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శశికాంత దాస్ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం హిమాంత బిశ్వశర్మను కలిశారు. అసోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలితా, సీఎం బిశ్వశర్మతో తన నియోజకవర్గం రాహా అభివృద్ధి గురించి చర్చించారు. కాగా ఈ అంశంపై సీఎంను మీడియా ప్రశ్నించగా.. శశికాంత దాస్ తమ పార్టీతోనే ఉంటారని, కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరని చెప్పారు.
దాస్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని, కానీ తమ పార్టీలో చేరాలా..? వద్దా..? అనే విషయంలో ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని అసోం సీఎం తెలిపారు. ఇదే వాదనను శశికాంత దాస్ కూడా వినిపించారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం హిమాంత బిశ్వశర్మ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా.. కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అన్నారు. అయితే, ఈ వింత వాదనలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విస్మయం వ్యక్తం చేస్తున్నది.