Karnataka | బెంగళూరు, అక్టోబర్ 22: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి, తన భార్య పేరున రిజిస్టర్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు దాఖలు చేశారు.
కోట్ల విలువైన అటవీ భూమి కబ్జా
కొంతమంది భూ ఆక్రమణదారులతో కుమ్మకైన బోస్‌రాజు రాయ్‌చూర్ జిల్లాలోని బీట్ గ్రామంలో 16.21 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని, అందులో ఐదు ఎకరాలు ఆయన భార్య కృష్ణవేణి పేరుతో రిజిస్టర్ చేశారని దినేశ్ చెప్పారు. దీనిపై 2022-23లో అటవీ శాఖ అతని భార్యను నిందితురాలిగా పేర్కొంటూ కేసు కూడా పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి ఖరీదు కోట్లలో ఉందని, అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన బోస్రాజ్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సిఫార్సు చేయాలని ఆయన కోరారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను బోస్‌రాజు తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, పరువు నష్టం కలిగించేవని పేర్కొన్నారు. వాస్తవానికి అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసును హైకోర్టు కలబుర్గి బెంచ్ అప్పట్లోనే కొట్టివేసిందని చెప్పారు.